మహిళా సంఘాలే గ్రామీణాభివృద్ధికి వెన్నెముక
సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
మర్రిగడ్డలో మహిళా భవనం, వాటర్ ప్లాంట్ ప్రారంభం
కాకతీయ, చందుర్తి : మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో మహిళా సమైక్య భవనం, రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించి, అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు నిర్మించడంతో పాటు రూ.20 లక్షల వరకు రుణాలు, వడ్డీ రాయితీలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల రుణాలు అందజేస్తున్నామని చెప్పారు. రైస్ మిల్లులు, సోలార్ ప్రాజెక్టులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ వంటి అవకాశాలను మహిళా సంఘాలకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మర్రిగడ్డ గ్రామంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రం, పల్లె దవాఖాన, రహదారులు, బోరు బావి, మరో మహిళా సంఘ భవనానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు తీసుకొచ్చామని, గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి కొనసాగుతుందని తెలిపారు.

