మంజూరైనా.. అందని సాయం!
ఏడు నెలలుగా సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం ఎదురుచూపులు
రూ.60 వేలు మంజూరైనా లబ్ధిదారుడికి చేరని వైనం
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు
కాకతీయ, చందుర్తి : ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం మంజూరైనా లబ్ధిదారుడికి చెక్కు అందకపోవడంతో ప్రభుత్వ పథకాల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన ఈగ ప్రతాప్ (తండ్రి: రామలింగం)కు వైద్య ఖర్చుల కోసం రూ.60 వేల సాయం మంజూరైంది. దరఖాస్తు సంఖ్య 338197/2025, చెక్కు సంఖ్య 128320గా ఉన్నా.. సుమారు ఏడు నెలలు గడిచినా చెక్కు మాత్రం చేతికి అందలేదు. సాయం మంజూరైన తర్వాత చెక్కు ఎక్కడ ఆగిపోయిందో, ఏ కార్యాలయంలో పెండింగ్లో ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. సమస్యను పరిష్కరించాలంటూ బాధితుడు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పష్టమైన సమాధానం లభించడం లేదని వాపోతున్నారు.
పేదల సాయానికీ జాప్యమేనా?
వైద్య అవసరాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సాయం సకాలంలో అందకపోవడంతో బాధిత కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మంజూరు ప్రక్రియ పూర్తయి చెక్కు జారీ అయినప్పటికీ లబ్ధిదారుడికి చేరకపోవడంపై అధికారుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏడు నెలలుగా చెక్కు కోసం ఎదురుచూస్తున్నా అధికారులు స్పందించకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కును లబ్ధిదారుడికి అందించడంలో జాప్యానికి కారణాలను అధికారులు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి చెక్కు పరిస్థితిని పరిశీలించి, లబ్ధిదారుడికి అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంజూరైన సాయం కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి రావడంపై సంబంధిత ప్రజాప్రతినిధులు కూడా స్పందించాలని కోరుతున్నారు.

