రేపు పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభ
నల్లబెల్లిలో ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం
ముఖ్య అతిథులుగా కేటీఆర్, హరీశ్‌రావు
పెద్దమ్మతల్లి ఆలయ ఆవరణలో సభ.. అనంతరం సహపంక్తి భోజనం
కాకతీయ, నల్లబెల్లి : దివంగత మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభను సోమవారం నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ సంస్మరణ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. సభ అనంతరం హాజరైన వారికి సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
భారీగా తరలివచ్చే అవకాశం
కేటీఆర్, హరీశ్‌రావు హాజరవుతున్న నేపథ్యంలో నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు నల్లబెల్లికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో సంస్మరణ సభకు సంబంధించిన ఏర్పాట్లలో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. సభకు హాజరయ్యే కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ నల్లబెల్లి పర్యటన సందర్భంగా భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో ట్రాఫిక్, భద్రత పరంగా ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో రేపటి కార్యక్రమానికి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భారీగా జనసందోహం ఏర్పడే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రముఖుల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.

