మద్యం దుకాణాలపై నిఘా ఏది?
అధిక ధరల వసూళ్లపై చర్యలెక్కడ?
గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ దుకాణాలపై దాడులేవీ..?
వాహనాల ద్వారా తరలింపుపై తనిఖీలెక్కడ?
ఎక్సైజ్ శాఖ పనితీరుపై అన్నీ ప్రశ్నలే.. సమాధానాలు కరువు..!
తనిఖీల లెక్కలు బయటపెట్టాలంటున్న ప్రజలు
కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండలంలో మద్యం విక్రయాలపై వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులు అబ్కారీ శాఖ పర్యవేక్షణ తీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. మద్యం దుకాణాల్లో నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర కంటే అధికంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు, గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా విక్రయాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు వినిపిస్తున్నా.. అధికారులు చేపడుతున్న తనిఖీలు, చర్యల వివరాలు మాత్రం వెల్లడికావడం లేదు. కొన్ని మద్యం విక్రయ కేంద్రాల్లో సీసాపై ఉన్న గరిష్ఠ చిల్లర ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారా, ఉల్లంఘనలు గుర్తించారా, గుర్తిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఫిర్యాదులు నిజమైతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, అవాస్తవమైతే ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
బెల్ట్ దుకాణాలపై ప్రత్యేక నిఘా అవసరం
గ్రామీణ ప్రాంతాలకు వాహనాల ద్వారా మద్యం తరలిస్తున్నారన్న ఆరోపణలపైనా అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్ని వాహనాలను తనిఖీ చేశారు, ఎన్ని కేసులు నమోదు చేశారు, అనధికారిక విక్రయాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అబ్కారీ శాఖ వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో నిర్వహించిన తనిఖీలు, నమోదైన కేసులు, విధించిన జరిమానాల వివరాలను బహిరంగపరచాలని కోరుతున్నారు. ప్రజా ఫిర్యాదులపై అధికారులు మౌనం వీడి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఎంఆర్‌పీ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

