ఖర్గేపై వివక్షను సహించం
దళిత నాయకుడిని అవమానించడం రాజ్యాంగ విలువలకు విరుద్ధం
వేదిక శుద్ధీకరణ కుల వివక్షకు నిదర్శనం
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
కాకతీయ, వరంగల్ బ్యూరో : దళిత నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై హల్ద్వానీలో జరిగిన వివక్షపూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. ఒక జాతీయ నాయకుడు ప్రసంగించిన వేదికను గంగాజలంతో శుద్ధీకరించడం, హవనం నిర్వహించడం కుల వివక్షకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు శుక్రవారం అంబేద్కర్ జంక్షన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ అనంతరం గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం చేపట్టారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు పాల్గొని ఖర్గేకు సంఘీభావం తెలిపారు.

రాజ్యాంగాన్ని అవమానించడమే
భారత రాజ్యాంగం అస్పృశ్యత, కుల వివక్షను నిషేధించిందని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న దళిత నాయకుడిపై ఇలాంటి చర్యలు జరగడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు విరుద్ధమన్నారు. కులం, మతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేసి చూసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఖర్గేపై వివక్షకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, అస్పృశ్యత నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మేయర్ గుండు సుధారాణి, పులి ప్రియాంక, తౌటం జాన్సీ, గొట్టిముక్కల సాగరిక రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వి. శ్రీనివాసరావు, బత్తిని శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

