భట్టి సతీమణిపై ఆరోపణలు
గవర్నర్ విచారణకు ఆదేశిస్తారా?
రూ.40 లక్షల బకాయిలకు రూ.4 లక్షలు అడిగారంటూ ఫిర్యాదు
10 శాతం కమిషన్ డిమాండ్ చేశారని ఆరోపణ
వైద్య, ఆరోగ్య శాఖలో రూ.120 కోట్ల బిల్లులు పెండింగ్ అంటూ ప్రస్తావన
బిల్లుల చెల్లింపులపై గతంలోనూ ఆరోపణలు
పర్సంటేజీ ప్రభుత్వమంటూ విపక్షాల విమర్శలు
గవర్నర్ శివప్రతాప్ శుక్లకు అడ్వకేట్ కరుపోతుల రేవంత్ ఫిర్యాదు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని భట్టిపై బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. తాజాగా అడ్వకేట్ కరుపోతుల రేవంత్ గవర్నర్ శివప్రతాప్ శుక్లకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలపై గవర్నర్ విచారణకు ఆదేశిస్తారా..? సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరుతారా..? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈనెల 10న గవర్నర్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, గతంలో బిల్లుల చెల్లింపులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వంలోని పెద్దల మధ్య కూడా ఈ విషయంపై తీవ్రంగా చర్చ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో విపక్షాలు ప్రభుత్వాన్ని పర్సంటేజీ ప్రభుత్వంగా విమర్శిస్తున్న నేపథ్యంలో అడ్వకేట్ రేవంత్ గవర్నర్కు ఫిర్యాదు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్కు సమర్పించిన ఫిర్యాదు ప్రతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈనెల 9న హైదరాబాద్లోని ఇందిరాపార్కు సమీపంలో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎస్.కె. ప్రసన్నకుమారి చేసిన ఆరోపణలను ఆధారంగా చేసుకుని కరుపోతుల రేవంత్ ఈనెల 10న గవర్నర్కు ఫిర్యాదు చేశారు. తాను వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందానని ప్రసన్నకుమారి మీడియా ముందు వెల్లడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాల విడుదల కోసం నందిని భట్టిని సంప్రదించినప్పుడు 10 శాతం కమిషన్ అడిగినట్లు ఆమె ఆరోపించారని తెలిపారు. తనకు రావాల్సిన రూ.40 లక్షల పదవీ విరమణ బకాయిలను విడుదల చేసేందుకు రూ.4 లక్షలు అడిగినట్లు ప్రసన్నకుమారి ఆరోపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పదవీ విరమణ బకాయిలపై ఆరోపణలు
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. తనకు రావాల్సిన రూ.40 లక్షల పదవీ విరమణ బకాయిలను విడుదల చేయడానికి 10 శాతం చొప్పున రూ.4 లక్షలు డిమాండ్ చేసినట్లు ఎస్.కె. ప్రసన్నకుమారి ఆరోపించారు. ఈ ఆరోపణలను ఆమె నిరసన కార్యక్రమంలో మీడియా ముందు వెల్లడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిందని, ఈ అంశంపై తెలుగు వార్తా సంస్థల్లోనూ కథనాలు ప్రచురితమైనట్లు కరుపోతుల రేవంత్ గవర్నర్కు సమర్పించిన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆరోపణలు నిజమో కాదో తేల్చేందుకు స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని ఫిర్యాదుదారు కోరారు. ఎవరినీ ముందుగానే దోషిగా నిర్ధారించడం లేదని, అయితే పదవీ విరమణ ఉద్యోగి చేసిన నిర్దిష్ట ఆరోపణలు ప్రజా ప్రయోజనానికి సంబంధించినవిగా ఉన్నందున అధికారికంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆరోపణలకు సంబంధించిన రికార్డులు, ఫైళ్ల కదలిక, ఆమోద ప్రక్రియ, బిల్లుల చెల్లింపుల వివరాలను పరిశీలించాలని కోరారు.
గతంలోనూ ఆరోపణల చర్చ
బిల్లుల చెల్లింపులకు సంబంధించి నందిని భట్టిపై గతంలోనూ అనేక మార్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజాగా పదవీ విరమణ ఉద్యోగి చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ అడ్వకేట్ రేవంత్ గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రభుత్వంలోని పెద్దల మధ్య కూడా ఈ విషయంపై సీరియస్గా చర్చ జరుగుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంపై విపక్షాలు బిల్లుల చెల్లింపులు, కాంట్రాక్టర్ల వ్యవహారాలను ప్రస్తావిస్తూ పర్సంటేజీ ప్రభుత్వం అంటూ విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భట్టి సతీమణిపై తాజాగా వచ్చిన ఆరోపణలు, వాటిని ప్రస్తావిస్తూ గవర్నర్కు అందిన ఫిర్యాదు రాజకీయంగా మరింత చర్చకు కారణమైంది. అయితే గతంలో వచ్చిన ఆరోపణలు, తాజాగా ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై అధికారికంగా విచారణ జరిగితేనే వాస్తవాలు తేలాల్సి ఉంది.
రూ.120 కోట్ల బిల్లుల ప్రస్తావన
వైద్య, ఆరోగ్య శాఖలో సుమారు రూ.120 కోట్ల విలువైన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేసేందుకు 6 శాతం నుంచి 10 శాతం వరకు కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని ఎస్.కె. ప్రసన్నకుమారి ఆరోపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫైళ్లు ముందుకు కదలడానికి, బిల్లులు క్లియర్ కావడానికి అక్రమ కమిషన్లు అడుగుతున్నారా అనే అంశాన్ని విచారణలో తేల్చాలని కోరారు. పదవీ విరమణ ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, సెలవుల నగదీకరణ, ఇతర తుది బకాయిల విడుదలకు సంబంధించిన ఫైళ్ల కదలిక, ఆమోదం, చెల్లింపుల రికార్డులను పరిశీలించాలని ఫిర్యాదులో కోరారు. వైద్య, ఆరోగ్య శాఖలోనే కాకుండా ఇతర శాఖల్లోనూ ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి డిమాండ్లు ఎదుర్కొన్న ఇతర పదవీ విరమణ ఉద్యోగుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని కోరారు. గవర్నర్కు సమర్పించిన ఫిర్యాదులో ఆరోపణలపై స్వతంత్ర, నిష్పాక్షిక, కాలపరిమితితో కూడిన విచారణ జరిపించాలని కరుపోతుల రేవంత్ కోరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆరోపణల్లో వాస్తవం లేకపోతే ఆ విషయాన్ని కూడా స్పష్టంగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన ఎస్.కె. ప్రసన్నకుమారితోపాటు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న ఇతర పదవీ విరమణ ఉద్యోగులకు వేధింపులు, ప్రతీకార చర్యలు లేదా బకాయిల ఆలస్యం జరగకుండా చూడాలని కోరారు. ఫిర్యాదు ప్రతులను అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్, తెలంగాణ లోకాయుక్త రిజిస్ట్రార్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ డీజీపీ, ముఖ్యమంత్రి కార్యాలయంలోని ప్రజావాణి, ఫిర్యాదుల విభాగానికి పంపినట్లు పత్రంలో పేర్కొన్నారు. ఆరోపణల తీవ్రత, ప్రజా ప్రయోజనం, పెద్ద సంఖ్యలో పదవీ విరమణ ఉద్యోగులు ప్రభావితమవుతున్నారన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు గవర్నర్కు చేసిన ఫిర్యాదు ప్రతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ అంశంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతుండగా, మరికొందరు ఆరోపణలు నిర్ధారణ కాకముందే వాటిని ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఫిర్యాదులోని అంశాలపై సామాజిక మాధ్యమాల్లోనూ చర్చ కొనసాగుతోంది. ఇప్పటివరకు గవర్నర్ కార్యాలయం నుంచి ఈ ఫిర్యాదుపై అధికారిక స్పందన వెలువడలేదు. గవర్నర్ ఫిర్యాదును పరిశీలించి విచారణకు ఆదేశిస్తారా, సంబంధిత శాఖ నుంచి నివేదిక కోరుతారా, అవినీతి నిరోధక శాఖకు పంపుతారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. గతంలోనూ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఆరోపణలు రావడం, తాజాగా పదవీ విరమణ ఉద్యోగి చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ గవర్నర్కు ఫిర్యాదు అందడం, విపక్షాలు పర్సంటేజీ ప్రభుత్వం అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. గవర్నర్ తదుపరి చర్య ఏమిటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

