ఆపద వేళ కొండంత అండగా సీఎంఆర్ఎఫ్
పాలకుర్తి నియోజకవర్గంలో 262 మందికి రూ.1,05,54,100 చెక్కులు
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
కాకతీయ,రాయపర్తి / పాలకుర్తి : నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆపద సమయాల్లో కొండంత అండగా నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన 262 మంది లబ్ధిదారులకు రూ.1,05,54,100 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేద ప్రజలపై వైద్య ఖర్చుల భారం పడకుండా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది అప్పుల పాలవుతున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా కొండంత భరోసా లభిస్తుందన్నారు. రూపాయి ఖర్చు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పారదర్శకంగా చేరవేస్తామని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

