ఎనగల్ సమస్యలు పరిష్కరించకుంటే.. నిరాహార దీక్ష!
వాగుపై వంతెనకు నిధులు మంజూరు చేయాలి
ఎన్నికల హామీలను అమలు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి
బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్
కాకతీయ, చందుర్తి : ఎనగల్ గ్రామ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ఎన్నికల హామీలను అమలు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనగల్‌లో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ముఖ్యంగా వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను డిమాండ్ చేశారు. ఎనగల్‌లోని ఎల్లమ్మ, బీరప్ప, చిన్నన్న–పెద్దన్న ఆలయాలు, డంపింగ్ యార్డు, వ్యవసాయ పొలాలకు వెళ్లే మార్గంలోని వాగుపై వంతెన లేక ప్రజలు, రైతులు, గౌడ కులస్తులు, పశువుల కాపర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాకాలంలో వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయని, గతంలో పశువులు కొట్టుకుపోయిన ఘటనలు కూడా జరిగాయని అన్నారు. ఎనగల్ నుంచి మామిడిపల్లి, మూడపల్లి, జోగాపూర్ వెళ్లే రహదారులను కూడా అభివృద్ధి చేయాలని కోరారు. గ్రామ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే అక్టోబర్ 5న అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నిరాహార దీక్ష చేపడతామని మొకిలే విజేందర్ హెచ్చరించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు అల్లాడి రమేష్, గౌడ సంఘం అధ్యక్షుడు గడ్డం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

