రూ.150 కోట్లతో శాశ్వత కరువు నివారణ!
మిడ్జిల్, ఉప్పునూతల, మక్తల్ మండలాల్లో ప్రత్యేక ప్రాజెక్టు
ప్రతి గ్రామంలో సభలు.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు
ఖర్చు చేసే ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి: మంత్రి పొంగులేటి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కరువు పరిస్థితులు ఎప్పుడు ఎదురైనా ప్రజలు, రైతులు తట్టుకునేలా రాష్ట్రంలోని మూడు మండలాల్లో రూ.150 కోట్లతో శాశ్వత నివారణ చర్యలు చేపట్టనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నీటి వనరుల సమర్థ వినియోగం, రైతు కుటుంబాల జీవనోపాధి మెరుగుదల లక్ష్యంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కరువు ప్రభావిత ప్రాంతాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్, నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉప్పునూతల, నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. జాతీయ విపత్తుల నిర్వహణ నిధి సహకారంతో చేపట్టే ఈ కార్యక్రమానికి విపత్తుల నిర్వహణ శాఖ పర్యవేక్షణ వహిస్తుందని, వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని వివరించారు. కరువు ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వర్షాధార వ్యవసాయం, సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, రైతు కుటుంబాల జీవనోపాధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మండలాలను ఎంపిక చేసినట్లు చెప్పారు.
గ్రామసభలతో కార్యాచరణ
రాష్ట్ర సచివాలయంలో శనివారం వ్యవసాయ, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. కరువు నిరోధక వ్యవసాయ విధానాలు, శాశ్వత పరిష్కారాలు, ప్రాజెక్టు కార్యాచరణ, నిధుల వినియోగంపై చర్చించారు. ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసుకుంటూ గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు క్షేత్రస్థాయిలో నెరవేరుతాయని అన్నారు. కరువు ప్రభావం వ్యవసాయానికే పరిమితం కాదని, గ్రామీణ ఉపాధి, కుటుంబ ఆదాయాలు, సంప్రదాయ వృత్తులపైనా పడుతుందని మంత్రి పేర్కొన్నారు. మహిళలు, యువత, రైతులు, కులవృత్తులపై ఆధారపడిన కుటుంబాలు సహా అన్ని వర్గాల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు తగిన శాశ్వత పరిష్కారాలతో ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
నిధుల వినియోగంపై నిరంతర పర్యవేక్షణ
ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పనుల ఎంపిక, అమలు, నిధుల వినియోగం, క్షేత్రస్థాయి ఫలితాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయ్యాయా లేదా అన్నదానికే పరిమితం కాకుండా, ప్రజలకు ఎంత మేర ప్రయోజనం కలిగింది, కరువు సమస్యను ఎదుర్కొనే సామర్థ్యం ఎంత పెరిగిందనే అంశాలను ప్రాజెక్టు విజయానికి ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎన్. గోపి తదితర అధికారులు పాల్గొన్నారు.

