పోలీసు అమరవీరులకు ఘన నివాళులు
గొర్రెకుంట నుంచి జాన్పీర్ల మీదుగా కొవ్వొత్తుల ర్యాలీ
కాకతీయ, గీసుగొండ:
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం గీసుగొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామునూరు ఏసీపీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 150 మంది పాల్గొన్నారు. గొర్రెకుంటలో ప్రారంభమైన ర్యాలీ జాన్పీర్ల మీదుగా కొనసాగి గొర్రెకుంట క్రాస్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా విధి నిర్వహణలో దేశ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించి అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజల రక్షణే లక్ష్యంగా పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ డి. విశ్వేశ్వర్, ఎస్ఐ రవి, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొని పోలీసు అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.

