వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం
డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, రేగుంట సునీల్ మాదిగ
అనారోగ్యంతో బాధపడుతున్న మాదిగ ఉద్యమకారుడికి అండ
కాకతీయ, హనుమకొండ : అనారోగ్యంతో బాధపడుతున్న మాదిగ ఉద్యమకారుడు సాతూరి వెంకన్నకు మాదిగ సమాజం అండగా ఉంటుందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ భరోసా ఇచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన వెంకన్నను ఆదివారం వారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంకన్నతో పాటు ఆయన భార్య మాదిగ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, వారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. వెంకన్నకు మెరుగైన వైద్యం అందించేందుకు నిమ్స్ వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్స అందించాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి సహకారం అందించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకన్న కుటుంబానికి నిత్యావసర బియ్యం అందజేశారు. చికిత్సకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ సలహాదారు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కొమ్ముల బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జనార్ధన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కవ్వాంపల్లి రవి, నాయకుడు సంపత్ తదితరులు పాల్గొన్నారు.

