అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి
కరీంనగర్లో 20 కి.మీ. సైకిల్ ర్యాలీ
విద్యార్థులు, వైద్యులు, సైక్లిస్టుల ఉత్సాహభరిత భాగస్వామ్యం
అక్టోబర్ 31 వరకు సంస్మరణ వారోత్సవాలు
ప్రజలు, విద్యార్థులు భాగస్వాములు కావాలి : సీపీ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఈ నెల 31 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నగరంలో 20 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సీపీ గౌష్ ఆలం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ సభ్యులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ
పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్, ప్రతిమ మల్టీప్లెక్స్, గీతాభవన్ చౌరస్తా, మంకమ్మతోటలోని పొన్నం కాంప్లెక్స్, శివ థియేటర్ సర్కిల్, కెమిస్ట్ భవన్ మీదుగా సాగింది. ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్ద యూ టర్న్ తీసుకుని కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, నాఖా చౌరస్తా, బోట్ చౌరస్తా, కమాన్ చౌరస్తా మీదుగా తిరిగి బస్టాండ్ సర్కిల్, ప్రతిమ మల్టీప్లెక్స్ చేరుకుని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ముగిసింది.

