బీజేపీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం
ఎల్‌నినో కరువు నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి
సీపీఎం నేత బండారు రవికుమార్
కాకతీయ, ఏటూరునాగారం: రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్న బీజేపీ విధానాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. ఆదివారం ఏటూరునాగారంలో జరిగిన ములుగు జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలపై కేసులు బనాయిస్తున్నారని, ఎన్నికల సంఘం పనితీరుపైనా విమర్శలు చేశారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్రం రూ.50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, రైతు భరోసాను రెట్టింపు చేసి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంటల కొనుగోలుకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని, విద్యుత్ కోతలు లేకుండా చూడాలని, రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని సూచించారు. ఉపాధి హామీ పనిదినాలను 200 రోజులకు పెంచాలని, బియ్యం ధరలను నియంత్రించాలని, ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ దావూద్ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి బి.రెడ్డి సాంబశివ, నాయకులు కొప్పుల రఘుపతి, చిట్టిబాబు, సోమ మల్లారెడ్డి, గొంది రాజేష్, జగటి చిన్నా, దామోదర్, దుగ్గి చిరంజీవి, టి.ఎల్.రవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

