మహిళలకు కాంగ్రెస్ అన్యాయం
బిల్లును అడ్డుకుని చారిత్రక తప్పిదం
వరసగా ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశ, నిస్పృహ
రాజకీయాల్లోకి రావాలనుకునే వారి ఉత్సాహంపై నీళ్లు
దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేలా మోదీ ఫార్ములా
కాంగ్రెస్, బీఆర్ఎస్ ను కలిపింది ఎంఐఎం పార్టీయే
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
కాకతీయ, నేషనల్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ మహిళలకు మరోసారి అన్యాయం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలని గతంలో చేసిన చట్టంలోనే ఉందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేలా మంచి ఫార్ములాను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చారని కొనియాడారు. బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరసగా ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశ, నిస్పృహ కాంగ్రెస్‌లో కనిపిస్తోందని ఎద్దేవా చేసారు. మహిళలు, దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగే బిల్లును అడ్డుకుని తప్పు చేశారని, రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళల ఉత్సాహంపై నీళ్లు చల్లారని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్‌ను కూడా అవమానించేలా రాహుల్‌గాంధీ మాట్లాడారని, ప్రధాని మోదీని జాదుగర్ అంటూ రాహుల్‌గాంధీ అవమానించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుడు తెలంగాణలో ఉన్నారని, అసదుద్దీన్ ఓవైసీ కళ్లల్లో ఆనందం చూసేందుకే మహిళా బిల్లును ఓడించారని వెల్లడించారు. మహిళల ఆకాంక్షలకు అసదుద్దీన్ ఓవైసీ దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు.
తీవ్ర అన్యాయం
దేశంలోని 70 కోట్ల మంది మహిళల రాజకీయ అవకాశాలను దెబ్బతీసిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టబోమని ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ నిలదీస్తామని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. 131వ రాజ్యాంగ సవరణకు అడ్డుకోవడం ద్వారా మహిళలకే కాకుండా దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన ద్వారా డీలిమిటేషన్ జరిగితే తీవ్ర నష్టం జరుగుతుందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి శుక్రవారం మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గకుండా డిలిమిటేషన్ జరుగుతుందని పునరుద్ఘాటించారు. కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుందనే ఆవేదనతోనే ప్రతిపక్షాలు డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించిన కిషన్ రెడ్డి మహిళల రిజర్వేషన్లకు ఎంఐఎం వ్యతిరేకమని అన్నారు. మహిళల రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ను కలిపింది ఎంఐఎం పార్టీయేనని ఆరోపించారు.

