సత్తెమ్మ పోరాటం యువతకు స్ఫూర్తి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ ఉద్యమకారినికి ఘనంగా నివాళి
అంతిమ యాత్రలో పాడె మోసిన కేటీఆర్
కాకతీయ, వేములవాడ: తెలంగాణ సత్తెమ్మ చేసిన పోరాటం, అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని అగ్రహారం గ్రామంలో ఆమె అంతిమయాత్ర సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వేములవాడ నియోజకవర్గంలోని అగ్రహారం గ్రామానికి చెందిన ప్రముఖ ఉద్యమకారిణి తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించి స్వయంగా పాడె మోసి చివరి యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ జై తెలంగాణ నినాదంతో జీవించిన ధైర్యవంతురాలిగా ఆమెను కొనియాడారు.
ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయం
స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన త్యాగం చిరస్మరణీయమని కేటీఆర్ పేర్కొన్నారు. ఆమె జీవితమంతా ఉద్యమానికి అంకితం చేయడం విశేషమని తెలిపారు. అలాంటి ఉద్యమకారిణి మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె సేవలు ఎప్పటికీ గుర్తుండేలా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భావోద్వేగంతో సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.

