అశాస్త్రీయ కోర్సులు తొలగించాలి
ప్రజానుకూల విద్యావిధానం అవసరం
జెవివి విద్యాసదస్సులో వక్తల డిమాండ్
ఎన్ఈపీ విధానంపై తీవ్ర విమర్శలు
కామన్ స్కూల్ విధానం అమలు చేయాలన్న ప్రతిపాదన
జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు చెలిమల రాజేశ్వర్
కాకతీయ, ఖమ్మం : ఉన్నత విద్యలో అశాస్త్రీయమైన కోర్సులను పూర్తిగా తొలగించి శాస్త్రీయ దృక్పథంపై ఆధారపడిన ప్రజానుకూల విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని జెవివి రాష్ట్ర అధ్యక్షుడు చెలిమల రాజేశ్వర్ పేర్కొన్నారు. ఖమ్మంలోని డిపిఆర్సి భవన్లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసదస్సులో ఆయన అధ్యక్షత వహించారు. ఎన్ఈపీ-2020, ఉన్నత విద్యలో జరుగుతున్న మార్పులు, పాఠ్యాంశాల రూపకల్పనపై జరిగిన చర్చల్లో పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాలు స్వయంగా నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి వల్ల ధనిక విద్యార్థులకు మాత్రమే ఉన్నత విద్య అందుబాటులోకి వస్తోందని వక్తలు అభిప్రాయపడ్డారు. గ్రేడింగ్ విధానం కారణంగా డిగ్రీ కోర్సులు నాలుగేళ్లకు పొడిగించడం సరైన పద్ధతి కాదని, దీని వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని సూచించారు.
ఎన్ఈపీపై విమర్శలు
ఎన్సిఈఆర్టి పాఠ్యపుస్తకాలలో డార్విన్ సిద్ధాంతం, పిరియాడిక్ టేబుల్, జెనటిక్స్ వంటి ప్రాథమిక శాస్త్రీయ అంశాలను తొలగించడం సరైంది కాదని, చరిత్రలో కొన్ని కీలక భాగాలను తొలగించి అశాస్త్రీయ అంశాలను చేర్చడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. దేశంలో ఇంకా కోట్లాది మంది నిరక్షరాస్యులు ఉన్నప్పటికీ వారిని అక్షరాస్యులుగా మార్చే దిశగా ప్రభుత్వం సమగ్ర కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శించారు. ప్రీ ప్రైమరీ స్థాయిలో పిల్లల మానసిక వికాసానికి అనుగుణంగా విద్య ఉండాలని, పోటీ తత్వం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో బాల్య దశ నుంచి ఉన్నత విద్య వరకు ఉచిత, నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించాలని, విద్యలో ప్రైవేటీకరణను నిలిపివేయాలని, జిడిపిలో కనీసం ఆరు శాతం నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు. ఎన్ఈపీ-2020ను రద్దు చేసి రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని, ఎన్సిఈఆర్టి పాఠ్యపుస్తకాలను స్వతంత్ర విద్యావేత్తలతో పునర్నిర్మించాలని సూచించారు. ఉపాధ్యాయ నియామకాలు పెంచి వారి పై భారం తగ్గించాలని, సమాజ ఆధారిత అక్షరాస్యతా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేసి సమాన విద్యావకాశాలు కల్పించాలని సదస్సు స్పష్టం చేసింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ అందె సత్యం, కోయ కోటేశ్వరరావు, ఎడమ శ్రీనివాసరెడ్డి, రాజా, అలవాల నాగేశ్వరరావు, శివన్నారాయణ, ఎల్వి రెడ్డి, అరుణశ్రీ, మల్లెంపాటి వీరభద్రరావు, వంజాకు లక్ష్మీనారాయణ, వి.మోహన్, కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.

