సర్కార్ దిగొచ్చేదాకా పోరాటం ఆపొద్దు
నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమం తీవ్రతరం చేయాలి
హుజురాబాద్ డంపింగ్ యార్డ్ నిర్ణయంపై ప్రజల్లో ఆందోళన
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ఉద్యమ కార్యాచరణపై నేతలతో చర్చ
కాకతీయ, హుజురాబాద్ : డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపొద్దని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ యుద్ధభేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి.
కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ నేతలు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి సమస్యపై వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే పరిసర ప్రాంతాల ప్రజల జీవనం దుర్భరమవుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపారు.
ఉద్యమం ఉధృతం చేయాలి
హుజూరాబాద్ ప్రజల ఆందోళన సమంజసమని పేర్కొన్న మంత్రి, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు. ఒకసారి ఉద్యమం ప్రారంభమైతే వెనక్కి తగ్గకుండా సర్కార్ నిర్ణయం మార్చుకునే వరకు పోరాటం కొనసాగించాలని అన్నారు. ఉద్యమం వేడి ప్రభుత్వ పెద్దలకు తాకే వరకు నిరసనలు కొనసాగించాలని, పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఉద్యమ కార్యాచరణపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. రోజువారీ కార్యక్రమాలపై సూచనలు చేసి, జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసనలు తెలియజేయాలని సూచించారు. ప్రజా ఉద్యమాలతో పాటు న్యాయపోరాటానికి కూడా సిద్ధం కావాలని తెలిపారు. మంగళవారం హుజూరాబాద్‌లో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించారు. అదేరోజు నిరసన కార్యక్రమం చేపట్టడంపై యోచిస్తున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో భారీ నిరసన దీక్ష నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

