శిశుమందిర్కు సహకారం అందిస్తా
పాఠశాల ప్రగతికి అవసరమైన చర్యలు
విద్యతో పాటు విలువల పెంపుపై దృష్టి పెట్టాలి
శిశుమందిర్ల బలోపేతం దేశ నిర్మాణానికి కీలకం
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : శిశుమందిర్ పాఠశాలల అభివృద్ధి, ప్రగతి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. సోమవారం పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల ప్రతినిధుల బృందం ఆయనను మర్యాదపూర్వకంగా కలసి పాఠశాల పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికలను వివరించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిశుమందిర్ పాఠశాలలు విద్యతో పాటు సద్గుణాలు, సంస్కారాలను పెంపొందిస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. తాను కూడా శిశుమందిర్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. పాఠశాలల బలోపేతం ద్వారా దేశ నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కార్యదర్శులు ఎలగందుల సత్యనారాయణ, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, గట్టు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు మోర రణధీర్ పాల్గొన్నారు. పాఠశాలలో అమలవుతున్న విద్యా విధానాలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల్లో నైతిక విలువల పెంపుపై వారు వివరించారు.

