ఐక్యతతో పనిచేస్తేనే కరీంనగర్ అభివృద్ధి
మినీ పర్యాటక కేంద్రాలుగా చెరువుల అభివృద్ధి
గల్లీ రోడ్లపై ప్రత్యేక దృష్టి.. అమృత్–2 కింద నిధుల వినియోగం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తే కరీంనగర్ అభివృద్ధిని అడ్డుకునే శక్తి ఎవరికీ ఉండదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. సోమవారం నగర కార్పొరేషన్ పరిధిలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులతో కలిసి తీగలగుట్టపల్లి, కొత్తపల్లి చెరువుల పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం చెరువుల పరిసరాలను పరిశీలించి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలోని ప్రధాన రహదారుల నిర్మాణం పూర్తయిందని, ఇక గల్లీ గల్లీలో గుంతలు పడ్డ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. త్వరలోనే అంతర్గత వీధుల్లో నూతన రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
చెరువుల అభివృద్ధితో పర్యాటక ప్రోత్సాహం
అమృత్–2 పథకం కింద కొత్తపల్లి, తీగలగుట్టపల్లి, రేకుర్తి చెరువుల పునరుజ్జీవానికి రూ.5.82 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో చెరువులను అభివృద్ధి చేసి మినీ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వినాయక, బతుకమ్మ నిమజ్జనాల సమయంలో భక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చెరువుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. చెరువుల చుట్టూ బండ్లు నిర్మించి అందంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలు కుటుంబాలతో కలిసి విశ్రాంతి తీసుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధిలో దూసుకుపోతుందని పేర్కొంటూ, కార్పొరేషన్ పాలకవర్గం గల్లీ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టడం అభినందనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సమీకరించి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

