ఆన్లైన్ ఇసుక సరఫరా ఆలస్యం
ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
20–25 రోజులుగా సరఫరా లేక స్తంభించిన నిర్మాణ పనులు
బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఇసుక కొనుగోలు
ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక హామీ అమలు కాలేదు
సీపీఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య
కాకతీయ, శంకరపట్నం : ఆన్లైన్లో బుకింగ్ చేసినప్పటికీ ఇసుక సరఫరా ఆలస్యమవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య అన్నారు. సోమవారం మండలంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసిన వారికి 20–25 రోజులుగా సరఫరా జరగకపోవడంతో ఇళ్లు నిర్మిస్తున్న ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిర్మాణ పనులు నిలిచిపోవడంతో కార్మికులకు ఉపాధి సమస్య తలెత్తుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా 5 ట్రాక్టర్ల ఇసుక అందిస్తామని హామీ ఇచ్చినా అది అమలు కాలేదని విమర్శించారు. మరోవైపు బ్లాక్ మార్కెట్లో ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుండడంతో ట్రాక్టర్కు ₹3,500 నుంచి ₹3,600 వరకు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆన్లైన్లో బుకింగ్ చేసిన వారికి 2–3 రోజుల్లోనే ఇసుక సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, భవన నిర్మాణ కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేశారు.

