కేసీఆర్ చావును ఎవరూ కోరుకోలేదు
అసెంబ్లీకి రాకుండా విమర్శలు చేయడం సరికాదు
రేవంత్ సర్కార్ ఎందుకు పోవాలి? ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తోంది
అప్పుల భారంలోనూ హామీలను అమలు చేస్తున్నాం
సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తూ రైతన్నకు అండగా ఉన్నాం
బీఆర్ఎస్ అప్పుల వల్ల నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కడుతున్నాం
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు బండి సంజయ్ చొరవ తీసుకోవాలి
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కాకతీయ, కరీంనగర్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఎవరూ చావు కోరుకోలేదని, ఆయనకు తగిన గౌరవం ఇచ్చామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని పలుమార్లు అసెంబ్లీ వేదికగా ఆహ్వానించినప్పటికీ ఆయన నుంచి స్పందన రాలేదని విమర్శించారు. మంగళవారం కరీంనగర్ ఆర్ & బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
అసెంబ్లీకి రాకుండా విమర్శలా?
జగిత్యాలలో బీఆర్ఎస్ నిర్వహించిన సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వంటి కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కోరినా కేసీఆర్ హాజరు కాలేదని గుర్తు చేశారు. “ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల ఫలితాలకన్నా ముందే విజయోత్సవాలు జరుపుకోవడం ప్రజల తీర్పును అవమానించడమే” అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడటం తగదని, గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఇంత అమర్యాదగా ప్రవర్తించలేదని హితవు పలికారు.
అప్పుల భారంలోనూ సంక్షేమం
బీఆర్ఎస్ పాలనలో చేసిన విచ్చలవిడి అప్పుల కారణంగా ప్రస్తుతం ప్రభుత్వం నెలకు రూ.6 వేల కోట్లు కేవలం వడ్డీలకే చెల్లిస్తోందని మంత్రి ఆరోపించారు. రైతుబంధు నిధుల కోసం గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును సైతం కుదువ పెట్టిందని విమర్శించారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రేవంత్ సర్కార్ పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే నాలుగు అమలు చేస్తున్నామని, త్వరలోనే మిగిలినవి కూడా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రైతు పక్షపాతి ప్రజా ప్రభుత్వం
ధాన్యం కొనుగోళ్లలో గతంలో రైతులు అనేక ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని మంత్రి తెలిపారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. రాబోయే వర్షాకాలానికి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని తరలించేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలని సూచించారు. త్వరలో ముఖ్యమంత్రితో కలిసి జగిత్యాలలో భారీ సభ నిర్వహిస్తామని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

