ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని ప్రశాంత్ నగర్ కాలనీలో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం మంగళవారం భక్తుల నామస్మరణతో మారుమోగింది. హనుమాన్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షలో ఉన్న స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో దీక్షా స్వాములకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ.. హనుమాన్ దీక్షా స్వాములకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సేవా సమితి సభ్యులు ఏటా ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన ఆకాంక్షించారు. 26వ డివిజన్ పరిధిలోని ఈ ఆలయం భక్తులకు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ కార్పొరేటర్ అంజన్ కుమార్, మాజీ కార్పొరేటర్ సరిల్ల ప్రసాద్‌తో పాటు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హనుమాన్ మాలధారులు, కాలనీ వాసులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మంగళవారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవా సమితి సభ్యులు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు.

