మిర్చి కాళీ బస్తాకు రూ.25గా నిర్ణయం
రైతులకు లబ్ధి చేకూర్చేలా మార్కెట్ కమిటీ చర్యలు
నిర్మాణ పనులపై అఖిలపక్ష రైతు సంఘాల హర్షం
అంతర్జాతీయ ప్రమాణాలతో మిర్చి యార్డు ఆధునికీకరణ
ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు విక్రయించిన మిర్చికి సంబంధించిన ప్రతి కాళీ బస్తాకు రూ.25 ధర నిర్ణయించినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు తెలిపారు. బుధవారం ఆయన అధ్యక్షతన అఖిలపక్ష రైతు సంఘాల జిల్లా నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ యరగర్ల హనుమంతరావు మాట్లాడుతూ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మార్కెట్ సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న మిర్చి యార్డు పనులను రైతు సంఘాల నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు, వినియోగదారులకు అన్ని హంగులతో ఈ యార్డు త్వరలోనే అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు. మార్కెట్ ఆధునికీకరణ పట్ల అఖిలపక్ష నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం
జిల్లా రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు అతీతంగా మార్కెట్ కమిటీ నిర్ణయాలు తీసుకుంటోందని చైర్మన్ స్పష్టం చేశారు. నూతనంగా నిర్మిస్తున్న యార్డులో రైతులకు మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖమ్మం అధ్యక్ష కార్యదర్శులు, దిగుమతి శాఖ అధ్యక్ష కార్యదర్శులు, ఎగుమతి శాఖ అధ్యక్షులు మరియు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

