తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దు
వేసవిలో ప్రజలకు ఇబ్బంది కలగకూడదు
పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి
రానున్న 45 రోజులు అత్యంత కీలకం
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు అన్ని గ్రామాల్లో ప్రజలకు నిత్యం తాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో రానున్న 45 రోజులు యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, మండలాల వారీగా మిషన్ భగీరథ ద్వారా అందుతున్న నీటి పరిమాణాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి వార్డు, విలీన గ్రామాలు, మారుమూల ప్రాంతాల వరకు నీరు అందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మిషన్ భగీరథ లక్ష్యం మేరకు నీటి సరఫరా జరగాలని, ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. నీటి ట్యాంకులు, పైప్‌లైన్ల లీకేజీలను వెంటనే అరికట్టాలని, ఇన్ టేక్ వెల్ వద్ద మోటార్లు నిరంతరం పనిచేసేలా నీటి పారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
శుభ్రతకు ప్రాధాన్యం
తాగునీటిని ప్రతిరోజూ క్లోరినేషన్ చేయాలని, ప్రతి 10 రోజులకు ఒకసారి నిల్వ ట్యాంకులను తప్పనిసరిగా శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. అమృత్ పథకం కింద చేపట్టిన ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పారిశుధ్య పనుల్లో అలసత్వం వహించకూడదని అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ అమరేందర్, ఈఈలు అన్వర్, సుమలత, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, డీఆర్డీఓ గీత, సీపీఓ శ్రీనివాసాచారి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

