సర్పంచ్ మేదరి టోనీకి ఘన సన్మానం
గ్రామ పంచాయతీ ఆదాయం పెంపులో విశిష్ట సేవలకు ప్రశంసలు
గ్రామాభివృద్ధికి ఆదర్శంగా నిలిచిన సింగరేణి పంచాయతీ
కాకతీయ, కారేపల్లి: సింగరేణి గ్రామపంచాయతీ అభివృద్ధికి తోడ్పడేలా ఆదాయ వనరులను బలోపేతం చేయడంలో విశేష కృషి చేసిన సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ)కు అరుదైన గౌరవం లభించింది. ఎండోమెంట్‌కు సంబంధించిన వారాంతపు సంత ద్వారా గ్రామపంచాయతీకి రావాల్సిన పన్నులను సమర్థవంతంగా వసూలు చేయించి, పంచాయతీ ఖజానాను నింపినందుకు ఆయనను బుధవారం ఘనంగా సన్మానించారు. ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) తేజావత్ రాంబాబు స్వయంగా సింగరేణి పంచాయతీని సందర్శించి సర్పంచ్ మేదరి టోనీతో పాటు ఉప సర్పంచ్ పెద్దమ్మ భాగ్యలక్ష్మిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఆర్థిక పరిపుష్టికి సర్పంచ్ తీసుకున్న చొరవ అభినందనీయమని ఈ సందర్భంగా డీపీఓ కొనియాడారు.
ఆర్థిక బలోపేతమే లక్ష్యం కావాలి
ఈ సందర్భంగా డీపీఓ రాంబాబు మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పంచాయతీకి రావాల్సిన నిధులను నిబంధనల ప్రకారం సక్రమంగా వసూలు చేయడం ద్వారా మౌలిక వసతుల కల్పన వేగవంతం అవుతుందన్నారు. సేకరించిన నిధులను గ్రామస్థుల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ, సింగరేణిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. సర్పంచ్ మేదరి టోనీ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమన్వయంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నెహ్రూ, సర్పంచ్ వరలక్ష్మి రాజు, బానోత్ పద్మ, రుప్లానాయక్, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

