ప్రజల ముంగిటకే ‘ప్రజా దర్బార్’
ఈ నెల 25 నుంచి మంత్రి పొంగులేటి శ్రీకారం
ఒకే వేదికపైకి పాలేరు నియోజకవర్గ అధికారులందరూ
కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలకు స్వస్తి
కాకతీయ, కూసుమంచి: సామాన్యులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే పని లేకుండా, అధికారులనే ప్రజల వద్దకు చేర్చేలా పాలేరు నియోజకవర్గంలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శ్రీకారం చుట్టారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రిగా క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ సరికొత్త పాలనా శకానికి ఆయన రూపకల్పన చేశారు. ఈ ప్రజా దర్బార్లో జిల్లా కలెక్టర్ మొదలుకొని నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకే వేదికపైకి రానున్నారు. రెవెన్యూ, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, స్థానిక మౌలిక సదుపాయాల వంటి ఫిర్యాదులపై తక్షణ నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రతి అర్జీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం.
నేడు రాయిగూడెం, సుబ్లేడుల్లో తొలి అడుగు
ఈ నెల 25న (శనివారం) రెండు చోట్ల ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. నేలకొండపల్లి మండలం రాయిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు. రాయిగూడెం, అజయ్తండా సహా 10 పంచాయతీల ప్రజలు హాజరుకావచ్చు. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 7:30 వరకు. సుబ్లేడు, రఘునాధపాలెం, హస్నాబాద్ సహా 13 పంచాయతీల ప్రజలకు ఈ వేదిక అందుబాటులో ఉంటుంది. ఏ ఒక్క పౌరుడు సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకూడదనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అధికారులు పూర్తి సమాచారంతో క్షేత్రస్థాయికి రావాలని ఆయన ఇప్పటికే ఆదేశించారు.

