విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలి
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
టీటీఆర్‌జేసీ బాలికల డార్మెటరీని ప్రారంభించిన మంత్రి
మణుగూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కాకతీయ, మణుగూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం మణుగూరు మండలం లంక మల్లారంలో రూ. 1 కోటి అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం భద్రాచలం ఐటీడీఏ పరిధిలో రూ. 2.70 కోట్లతో నిర్మించిన టీటీఆర్‌జేసీ బాలికల డార్మెటరీ హాల్‌ను ప్రారంభించారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ధనికుల పిల్లలతో సమానంగా కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకోసం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రైవేటుకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు తల్లులు వండిన రుచితో నాణ్యమైన పోషకాహారాన్ని అందిస్తున్నామని, డైట్ ఛార్జీలను కూడా పెంచామని గుర్తుచేశారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి నియోజకవర్గంలో రూ. 65 కోట్లతో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
నియోజకవర్గానికి 4,500 ఇందిరమ్మ ఇళ్లు
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 380 గ్రామాలకు సుమారు 4,500 ఇందిరమ్మ ఇళ్లను ఆమోదించామని తెలిపారు. గిరిజన అభివృద్ధి కోసం అదనంగా వెయ్యి ఇళ్లు మంజూరు చేశామన్నారు. రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ వసతులను వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు.
99 రోజుల కార్యాచరణ
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల కార్యాచరణతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ.. గిరిజన గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 53 కోట్లు మంజూరు చేసిందని, కొత్త డార్మెటరీతో 600 మంది విద్యార్థినులకు వసతి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, సర్పంచ్ పూనెం రమేష్, ప్రిన్సిపాల్ రాణి, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

