మున్సిపల్ ఉద్యోగులపై దాడి.. నల్ల బ్యాడ్జీలతో నిరసన
కరీంనగర్ ఘటనను ఖండించిన హుజురాబాద్ సిబ్బంది
విధుల నిర్వహణలో భద్రత కల్పించాలని డిమాండ్
కాకతీయ, హుజురాబాద్: ప్రభుత్వ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ మున్సిపల్ సిబ్బంది మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సానిటరీ ఇన్స్పెక్టర్పై జరిగిన దాడికి నిరసనగా.. భోజన విరామ సమయంలో పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల సేవలో ఉండే మున్సిపల్ ఉద్యోగులపై దాడులు జరగడం దురదృష్టకరమని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అన్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, విధుల్లో ఉన్న ఉద్యోగులకు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో కార్యాలయ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ నాయిని అశ్వినీ గాంధీ, సానిటరీ ఇన్స్పెక్టర్ దరిపల్లి కిరణ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, జూనియర్ సహాయకులు వలీ పాషా, రాజయ్య, సానిటరీ మేస్త్రీ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

