మోతాదుకు మించి యూరియా వాడకం భూమికి చేటు
నియంత్రించకుంటే సమతుల్యం దెబ్బతింటుంది
రైతు వేదికలో శాస్త్రవేత్తల అవగాహన సదస్సు
కాకతీయ, కూసుమంచి: వ్యవసాయంలో అధిక మొత్తంలో యూరియా వాడకం వల్ల భూమి తన సహజ సమతుల్యాన్ని కోల్పోయి నిస్సారమవుతుందని కూసుమంచి డివిజన్ ఏడీఏ సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పావనితో కలిసి ఆయన రైతులకు సాగుపై కీలక సూచనలు చేశారు. శాస్త్రవేత్త పావని మాట్లాడుతూ.. రైతులు విచక్షణారహితంగా ఎరువులు వాడకుండా, భూసార పరీక్షలకు అనుగుణంగా సమతుల్య ఎరువులను వినియోగించాలని కోరారు. పంట మార్పిడి పద్ధతులను పాటించాలని, సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపడం ద్వారా నాణ్యమైన దిగుబడి సాధించవచ్చని వివరించారు. ఏడీఏ సతీష్ మాట్లాడుతూ.. పొలాల్లో పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల భూమిలోని మిత్ర పురుగులు నశిస్తాయని, వాటిని ఎరువుగా మార్చుకోవాలని సూచించారు.
బీటీ-3 సాగు చట్టరీత్యా నేరం..
మండల వ్యవసాయ అధికారి (ఏఓ) రామడుగు వాణి మాట్లాడుతూ.. పత్తి సాగు చేసే రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీటీ-3 విత్తనాలను అమ్మడం, కొనడం లేదా సాగు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. తగినంత వర్షపాతం నమోదైన తర్వాతే విత్తుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఏఓ అరుణ, సీడ్ సర్టిఫికేషన్ బోర్డు మెంబర్ రేలా వెంకట్ రెడ్డి, ఏఈఓలు జానీ బాబా, ప్రియాంక మరియు రైతులు పాల్గొన్నారు.

