నేడు పాలేరు, అరెంపులలో ‘ప్రజా దర్బార్’
ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు
రెండు కేంద్రాల్లో 25 గ్రామాల సమస్యల పరిష్కారం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి పొంగులేటి
కాకతీయ, కూసుమంచి : సామాన్యులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదనే లక్ష్యంతో పాలేరు నియోజకవర్గంలో మంగళవారం ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేరుగా ప్రజల వద్దకే వచ్చి విన్నపాలను స్వీకరించనున్నారు. కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లోని రెండు ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఈ కార్యక్రమం జరగనుంది. కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయ ఆవరణలో ఉదయం 8 గంటల నుంచి దర్బార్ ప్రారంభమవుతుంది. ఈ కేంద్రానికి పాలేరు, నాయకన్‌గూడెం, భగవత్వీడు తండా, మంగళ్ తండా, కొత్తూరు, నర్సింహులగూడెం సహా మొత్తం 13 గ్రామ పంచాయతీల ప్రజలు హాజరుకావచ్చు.
అరెంపుల కేంద్రం (మధ్యాహ్నం 3:30 గంటలకు)
ఖమ్మం రూరల్ మండలం అరెంపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మరో దర్బార్ నిర్వహించనున్నారు. అరెంపుల, చింతపల్లి, కొండాపురం, అరేకోడు, తల్లంపాడు, ఎం.వెంకటాయపాలెం సహా 12 గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాలు, పంచాయతీరాజ్ సహా అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ వేదికలపై అందుబాటులో ఉంటారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. “ప్రతి విన్నపాన్ని నేరుగా పర్యవేక్షిస్తాం.. ప్రజలకు జవాబుదారీగా ఉంటాం” అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సంబంధిత గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి కోరారు.

