ఇందిరా డైరీ పనుల్లో నాణ్యత పాటించాలి
ముదిగొండ మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర పర్యటన
అభివృద్ధి పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీ
కాకతీయ, ముదిగొండ: ముదిగొండ మండలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దివాకర మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన, ప్రభుత్వ పథకాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యంగా మండలంలో నిర్మిస్తున్న ఇందిరా డైరీని సందర్శించిన కలెక్టర్, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. డైరీ ఏర్పాటుకు సంబంధించిన నిధుల వినియోగం, ఇప్పటివరకు జరిగిన పనుల వివరాలపై అధికారులను ప్రశ్నించారు. డైరీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, నిర్మాణంలో ఎక్కడా నాణ్యత లోపించకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామాల్లో మౌలిక వసతులపై కలెక్టర్ సమీక్షించారు. రహదారుల పరిస్థితి, వేసవిలో తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

