తీగలగుట్టపల్లి ఆర్ఓబీ పనులపై మేయర్ ఆగ్రహం
నత్తనడకన సాగుతున్న నిర్మాణంపై అసంతృప్తి
యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం
దుమ్ము నివారణకు చర్యలు చేపట్టాలి
కాకతీయ, కరీంనగర్: నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై మేయర్ కొలగాని శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం అధికారులతో కలిసి ఆయన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, పురోగతిని సమీక్షించారు. పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని పేర్కొంటూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ ప్రాంతంలో రోడ్లు గుంతలమయంగా మారి, దుమ్ము కారణంగా వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము లేవకుండా ఉండేందుకు ప్రతిరోజూ నీళ్లు చల్లాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఒక వైపు ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
నాణ్యతలో రాజీ పడొద్దు..
భూసేకరణ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు. పనుల వేగంతో పాటు నాణ్యత విషయంలోనూ ఎటువంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఏడీఈఎన్ బిక్షపతి, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్, సాదినేని మునీందర్ మరియు నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

