కార్మికుల కష్టం దేశానికి కిరీటం
కారేపల్లిలో ఘనంగా మే డే ర్యాలీ
పోరాటాలతోనే హక్కుల రక్షణ
: సీపీఎం నేత నాగేశ్వరరావు
కాకతీయ, కారేపల్లి: కార్మిక లోకానికి మే డే స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తుందని, శ్రమజీవుల కష్టం దేశ ప్రగతికి కిరీటం వంటిదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కారేపల్లిలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు, కర్షకులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. ర్యాలీ అనంతరం వివిధ కేంద్రాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు జరిగాయి. రైల్వే స్టేషన్ బజార్లో హమాలీ వర్కర్స్ యూనియన్, బస్టాండ్ సెంటర్లో సీపీఎం, సినిమా హాల్ సెంటర్లో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ మరియు అంబేద్కర్ సెంటర్లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేడుకలు మిన్నంటాయి. మండలంలోని పలు గ్రామాల్లోనూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మే డే కార్యక్రమాలు నిర్వహించారు.
చట్టాల సవరణపై నిరసన..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలను పాలకులు మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల్లో మార్పులు, విద్యుత్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలని కోరారు. పోరాటాల ద్వారానే హక్కులను కాపాడుకోగలమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కె. నరేంద్ర, ఐద్వా నేత కె. ఉమావతి, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి కె. రవి, వివిధ సంఘాల నాయకులు చిత్తూలూరి వీరయ్య, హుస్సేన్, ముక్క సీతారాములు, తలారి దేవ ప్రకాష్, బానోత్ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.

