రేపు కూసుమంచిలో ‘ప్రజా దర్బార్’..
ప్రజల చెంతకే యంత్రాంగం – వేదికపైనే పరిష్కారం
కాకతీయ, కూసుమంచి: పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే చేర్చే లక్ష్యంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రేపు (ఆదివారం) కూసుమంచి క్లస్టర్ పరిధిలో భారీ ‘ప్రజా దర్బార్’ నిర్వహించనున్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 08:00 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఈ సదస్సులో ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, పింఛన్లు వంటి అంశాలపై ప్రజల నుంచి మంత్రి నేరుగా విన్నపాలను స్వీకరిస్తారు. కేవలం దరఖాస్తులు తీసుకోవడమే కాకుండా, అర్హులైన బాధితులకు వేదికపైనే తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు వేదికపైనే అందుబాటులో ఉండనున్నారు.
హాజరుకావాల్సిన గ్రామాలు
కూసుమంచి క్లస్టర్ పరిధిలోని కూసుమంచి, ఈశ్వరమాదారం, రాజుపేట బజార్, రాజుపేట, గోరిలాపాడు తండా, అజ్మీరా హీరామన్ తండా, జక్కేపల్లి, జక్కేపల్లి ఎస్సీ కాలనీ, పెరికసింగారం, మల్లేపల్లి, గట్టుసింగారం, జుజ్జులరావుపేట, మల్లాయిగూడెం, లింగారంతండా, గంగబండ తండా గ్రామాలకు చెందిన ప్రజలు ఈ ప్రజా దర్బార్‌కు హాజరై తమ సమస్యలను తెలియజేయవచ్చని అధికారులు వెల్లడించారు.

