కరీంనగర్ వాసులకు తిరుపతి రైలు ముచ్చట!
మే 9 నుంచి క్రమబద్ధంగా నాందేడ్–తిరుచానూర్ సేవలు
రద్దీ నివారణకు అదనపు బోగీలు.. భక్తులకు ఊరట
కాకతీయ, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ఇప్పటివరకు ప్రత్యేక వారాంతపు రైలుగా నడుస్తున్న నాందేడ్–తిరుచానూర్ (17633) రైలును మే 9వ తేదీ నుంచి క్రమబద్ధీకరిస్తున్నట్లు (Regular Service) ప్రకటించింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులు, ముఖ్యంగా ఏడుకొండల వాడి దర్శనానికి వెళ్లే భక్తులకు రవాణా కష్టాలు తీరనున్నాయి.
అదనపు బోగీలతో రద్దీకి చెక్..
ఈ మార్గంలో ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరగడంతో టికెట్ల లభ్యత సమస్యగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు అదనపు బోగీలను జోడించడంతో పాటు ముందస్తు రిజర్వేషన్ కోటాను కూడా పెంచారు. ఫలితంగా చివరి నిమిషంలో ప్రయాణాలు పెట్టుకునే వారికి కొంత ఊరట లభించనుంది.
ముఖ్య పట్టణాల మీదుగా ప్రయాణం..
ఈ రైలు కుత్బుల్లాపూర్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఈ రైలు అందుబాటులోకి రావడంతో హర్షం వ్యక్తమవుతోంది. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు కూడా ఈ రైలు సేవలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. రైలును క్రమబద్ధం చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఈ మార్గంలో మరిన్ని సర్వీసులు పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

