టీజేఎస్ ప్లీనరీని విజయవంతం చేయండి
హుజురాబాద్లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మే 12న పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన
కాకతీయ, హుజురాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) 4వ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు పిలుపునిచ్చారు. శనివారం హుజురాబాద్ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి ప్లీనరీకి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముక్కెర రాజు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ రథసారధి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రజా పక్షాన నిలబడి పోరాడుతోందని గుర్తుచేశారు. ధన ప్రభావానికి అతీతంగా, నైతిక విలువల కోసమే టీజేఎస్ పనిచేస్తోందని రాజు పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ ఆశించిన తెలంగాణ పునర్నిర్మాణమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం గళమెత్తుతున్నామని తెలిపారు. ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ప్లీనరీ సమావేశానికి కరీంనగర్ జిల్లా నుంచి కార్యకర్తలు, నాయకులు, మేధావులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి, జిల్లా అధ్యక్షుడు మోరె గణేష్, ఉపాధ్యక్షుడు కర్రె సతీష్ యాదవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అరికిల్ల భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.

