నారద మహర్షి ప్రపంచపు తొలి పాత్రికేయుడు
జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి
ముగిసిన నారద జయంతి ఉత్సవాలు
జర్నలిస్టులకు పురస్కారాల ప్రదానం
రైటప్ : ఐన్యూస్ వరంగల్ బ్యూరో చీఫ్ బూరం ప్రశాంత్‌ను సత్కరిస్తున్న విజయభారతి, ప్రొఫెసర్ జి. గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు వల్లీశ్వర్, తదితరులు
కాకతీయ,హైదరాబాద్ : లోక కళ్యాణం కోసం సమాచారాన్ని అందించిన నారద మహర్షి ప్రపంచానికే తొలి పాత్రికేయుడని పలువురు వక్తలు కొనియాడారు. సమాచార భారతి ఆధ్వర్యంలో కోఠీలోని వైఎంఐఎస్ హాలులో శనివారం నారద జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మీడియా రంగంలోని వివిధ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన జాతీయవాద జర్నలిస్టులకు పురస్కారాలను అందజేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి, సమాచార భారతి అధ్యక్షులు ప్రొఫెసర్ జి. గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు వల్లీశ్వర్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో ‘వార్త’ దినపత్రిక సంపాదకులు దామెర్ల సాయిబాబా, సీనియర్ జర్నలిస్ట్ జంధ్యాల శరత్ బాబు, మహిళా జర్నలిస్టు వల్లీ పద్మాంజలి (అంజలి), సీనియర్ కార్టూనిస్ట్ సరస్వతుల రామ నరసింహం (సరసి), ఐన్యూస్ వరంగల్ బ్యూరో చీఫ్ బూరం ప్రశాంత్, రాజ్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ లక్ష్మి ఉన్నారు.
ధర్మాచరణే నారదుడి లక్ష్యం
ఈ సందర్భంగా ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నారదుడు కలహ భోజనుడు కాదని, ధర్మాచరణ పరాయణుడని స్పష్టం చేశారు. పాశ్చాత్య నాగరికత ప్రభావంతో తొలి పాత్రికేయుడిగా నారదుడిని గుర్తించడంలో నిర్లక్ష్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార భారతి మూడు దశాబ్దాలుగా భారతీయ సంస్కృతిని కాపాడుతూ, జాతీయవాద పాత్రికేయులను తయారు చేస్తోందని తెలిపారు. ముఖ్య అతిథి విజయభారతి మాట్లాడుతూ.. దేశం యొక్క అంతరాత్మను మలిచే శక్తి మీడియాకు ఉందని, మానవ హక్కుల పరిరక్షణలో జర్నలిస్టుల నివేదికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
వృత్తి పట్ల నిబద్ధత అవసరం
అనంతరం అవార్డు గ్రహీతలు తమ వృత్తి అనుభవాలను పంచుకున్నారు. కార్టూనిస్ట్ సరసి మాట్లాడుతూ.. నారదుడిని కేవలం నవ్వుల పాలు చేసే క్యారెక్టర్‌గా మార్చడం సరికాదన్నారు. సీనియర్ ఎడిటర్ సాయిబాబా జర్నలిజం పవిత్రతను చాటిచెప్పగా, శరత్ బాబు నిబద్ధత లేని రాతలు అగ్నిపరీక్షలని వ్యాఖ్యానించారు. బూరం ప్రశాంత్ మేడారం జాతర చరిత్రలోని వక్రీకరణలను సరిదిద్దాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఇటీవల కన్నుమూసిన జర్నలిస్టు మన్యంకొండకు నివాళులు అర్పించారు.

