ప్రజల సహకారంతోనే ‘జనగణన’ విజయవంతం
ఈ నెల 11 నుంచి క్షేత్రస్థాయిలో సర్వే
తప్పుల్లేకుండా వివరాలు నమోదు చేయాలి: కిషన్ రావు
కాకతీయ, జమ్మికుంట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా గణన (సెన్సెస్) కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా డిప్యూటీ గణాంక అధికారి కిషన్ రావు సూచించారు. జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఎన్యూమరేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణ సోమవారంతో ముగిసింది. మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రావు మాట్లాడుతూ.. ఎన్యూమరేటర్లు ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి ఇంటి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. “ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారికి అవగాహన కల్పిస్తూ సెన్సెస్ ఫారమ్‌లోని అన్ని కాలమ్‌లను పూర్తి చేయాలి. ప్రజల నుంచి లభించే సహకారమే ఈ సర్వే విజయానికి కీలకం” అని ఆయన పేర్కొన్నారు. సర్వే సమయంలో తలెత్తే సందేహాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీధర్, టీపీఎస్ రాజ్‌కుమార్, టీపీఎబీవో దీపికల సమన్వయంతో నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నివాసితులు కూడా తమ వద్దకు వచ్చే గణన సిబ్బందికి ఖచ్చితమైన వివరాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ట్రైనర్లు, ఉపాధ్యాయులు మరియు పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.

