కేశవపట్నంలో ‘వాలీబాల్’ శిక్షణ శిబిరం ప్రారంభం
కాకతీయ, శంకరపట్నం: గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరానికి శ్రీకారం చుట్టారు. సోమవారం పాఠశాల ఆవరణలో వ్యాయామ ఉపాధ్యాయుడు భక్తు రాజకుమార్ ఈ శిబిరాన్ని ప్రారంభించి, క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా రాజకుమార్ మాట్లాడుతూ.. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని, అవి విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం మరియు మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. 14 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇలాంటి శిక్షణ శిబిరాల ద్వారా విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టి, వారిని రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

