‘ఫిట్ ఇండియా’ సాధనకు ఓపెన్ జిమ్‌లు దోహదం
రూ. కోటితో 17 ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
నాల్కో సీఎస్సార్ నిధులతో మలయప్ప ఫౌండేషన్ ముందడుగు
కిసాన్‌నగర్, దుర్షేడులలో జిమ్‌లను ప్రారంభించిన కేంద్ర మంత్రి
కమాన్‌పూర్‌లో రూ. 20 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
కాకతీయ, కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా’ సాధనలో భాగంగా నగర ప్రజల శారీరక దృఢత్వం కోసం ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. నాల్కో సంస్థ సామాజిక బాధ్యత (సీఎస్సార్) నిధుల సహాయంతో, మలయప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో దాదాపు రూ. కోటి అంచనా వ్యయంతో 17 డివిజన్లలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా కిసాన్‌నగర్ అంబేద్కర్ యూత్ క్లబ్ సమీపంలో, అలాగే దుర్షేడు గ్రామంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన రెండు ఓపెన్ జిమ్‌లను మంగళవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ స్థానిక ప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలయప్ప ఫౌండేషన్ డైరెక్టర్లు డాక్టర్ గడ్డం అరుంజయ్, గడ్డం అనూష మాట్లాడుతూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేస్తూ ఈ జిమ్‌లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిత్యం పనులతో బిజీగా ఉండే నగరవాసులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి శారీరక ఉల్లాసాన్ని పెంపొందించుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నగరంలోని అన్ని 17 డివిజన్లలో త్వరలోనే ఈ జిమ్‌ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈ సౌకర్యాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకుని మెరుగైన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు.
రూ. 20 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన:
ఓపెన్ జిమ్‌ల ప్రారంభోత్సవం అనంతరం కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గత ఆరేళ్లుగా ఉపాధి హామీ పథకం ద్వారా వందల కోట్ల రూపాయల కేంద్ర నిధులను వెచ్చించి మౌలిక వసతులు కల్పించినట్లు గుర్తుచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయని, వాటి ద్వారా సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ఇతర గ్రామాల్లోనూ మౌలిక వసతుల పనులను వేగవంతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

