ప్రజా పాలన కాదు.. ఇది ప్రజా వంచన పాలన!
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం
ఎర్రటి ఎండల్లో రోడ్డుకెక్కుతున్న అన్నదాతలు
మూడు పంటల ‘రైతు భరోసా’ను కాంగ్రెస్ సర్కారు అటకెక్కించింది
కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కోతల్లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి
తూకం వేసిన ధాన్యానికి 24 గంటల్లోగా అన్లోడ్ ప్రక్రియ పూర్తి చేయాలి
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ధ్వజం
కాకతీయ, జగిత్యాల : రాష్ట్రంలో ప్రజా పాలన నెపంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా వంచిస్తోందని, ఇక్కడ సాగుతోంది ప్రజా పాలన కాదు.. “ప్రజా వంచన పాలన” అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా పరిషత్ తొలి మాజీ ఛైర్పర్సన్ దావా వసంత సురేష్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరన్ రావు తదితరులు పాల్గొన్నారు.
రైతుల కడుపు మండి రోడ్డుకెక్కారు
మార్కెట్లలో రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదని, ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. పూడూరులో రైతులు ఆందోళన చేపడితే తప్ప అధికారుల్లో చలనం రాలేదని విమర్శించారు. గతేడాది జగిత్యాలలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి గాను 1.40 లక్షల టన్నులు సేకరించారని, కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 20 వేల క్వింటాళ్లు మాత్రమే సేకరించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. రైతులకు నష్టం కలగకుండా ఎలాంటి తరుగు (కోత) లేకుండా 40 కిలోల 600 గ్రాముల చొప్పున ధాన్యం సేకరించాలని, తూకం వేసిన ధాన్యాన్ని 24 గంటల్లోగా ఆన్లోడ్ చేయాలని డిమాండ్ చేశారు.
అటకెక్కిన రైతు భరోసా.. సగం మందికే రుణమాఫీ
రాహుల్ గాంధీతో డిక్లరేషన్ చేయించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మూడు పంటల రైతు భరోసాను ఎగ్గొట్టిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. రైతు బంధు కింద ఇవ్వాల్సిన రూ. 10 వేలు కూడా ఇగ్గొట్టారని ఎద్దేవా చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీని కేవలం సగం మందికే వర్తింపజేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. పంటల బీమా ప్రీమియంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ 25 శాతం వాటాను చెల్లించలేక ఆ పథకాన్నే పక్కనబెట్టాయన్నారు.
బెదిరింపులు ఆపండి.. కల్లాలు ఖాళీ చేయాలి
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. కల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేసిన రైతులు, మహిళలపై దాడులు చేయడం దారుణమన్నారు. గింజ కటింగ్ లేకుండా, హమాలీ చార్జీలు లేకుండా కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలికిన స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూసుకోవాలన్నారు. ప్రస్తుతం బస్తాకు 3 కిలోల చొప్పున కటింగ్ జరుగుతోందని, తరుగు లేకుండా తూకం వేస్తే తాను రాజకీయం నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. మాజీ జెడ్పీ ఛైర్మన్ దావా వసంత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్షతో గెలిచిన సంజయ్, ఇప్పుడు అధికార పార్టీ పంచన చేరడం సిగ్గుచేటన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆయిల్నేని వెంకటేశ్వర రావు, శీలం ప్రవీణ్ కుమార్, దావా సురేష్, ఆయిల్నేని సాగర్ రావు, గాజుల రాజేందర్, కళ్లేపల్లి దుర్గయ్య, మాసర్తి రమేష్, ధర రమేష్ బాబు, నేహాల్, దేవేందర్ నాయక్, సామల రాజశేఖర్, పొట్టవతిని సతీష్, శీలం సురేందర్, నల్ల స్వామి, కే. వంశీ, చింతకింది నరేష్, మునీందర్ రెడ్డి, చెట్పల్లి సుధాకర్, శ్రీరాముల గంగాధర్, మహిపాల్, నక్క జీవన్, రాజు తదితరులు పాల్గొన్నారు.

