భూసారాన్ని కాపాడుకోవాలి
యూరియా అధిక వినియోగం తగ్గించాలి
భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల వినియోగం జరగాలి
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
రైతు వేదిక వద్ద ఘనంగా ప్రారంభమైన రైతు వారోత్సవాలు
కాకతీయ, కొత్తగూడెం: రైతులు పొలాల్లో అధిక మోతాదులో యూరియాను వాడటం వల్ల భూసారం దెబ్బతిని ఉత్పాదకత తగ్గే ప్రమాదం ఉందని, కాబట్టి యూరియా వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సూచించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చుంచుపల్లి మండలంలోని ప్రశాంత్‌నగర్ రైతు వేదిక వద్ద మంగళవారం నిర్వహించిన రైతు వారోత్సవాల తొలి రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమం కోసమే ఈ రైతు వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు రైతులు పంట మార్పిడి పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలని, ఒకే రకమైన పంటను వరుసగా సాగు చేయడం వల్ల నేల సారం క్షీణిస్తుందని హెచ్చరించారు. భూసార పరీక్షల నివేదిక ఆధారంగా మాత్రమే సమతుల్య ఎరువులను వినియోగించి తక్కువ పెట్టుబడితో మెరుగైన దిగుబడులు సాధించాలన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించే ఆధునిక సాంకేతిక పద్ధతులను రైతులు అందిపుచ్చుకోవాలని కోరారు.
రైతు ముంగిటకు శాస్త్రవేత్తలు – సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ:
ఈ కార్యక్రమంలో భాగంగా “రైతు ముంగిటకు శాస్త్రవేత్తలు” అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రవేత్తలు నేరుగా గ్రామ స్థాయికి చేరుకుని సమతుల్య ఎరువుల యాజమాన్యం, పంటల వారీగా అవసరమైన సూక్ష్మ, స్థూల పోషకాల వివరాలు, సహజ వ్యవసాయ పద్ధతులపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం భూసార పరీక్షలు చేయించుకున్న రైతులకు ‘సాయిల్ హెల్త్ కార్డులను’ అందజేసి వాటి ప్రయోజనాలను వివరించారు. రాబోయే వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సన్న రకాల వరి వంగడాలు, వాటి సాగు పద్ధతులపై రైతులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లాలోని 67 రైతు వేదికల్లో వారోత్సవాలు: జేడీఏ బాబురావు
జిల్లా వ్యవసాయ అధికారి (జేడీఏ) బాబురావు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 67 రైతు వేదికల్లో మే 4వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు ఈ రైతు వారోత్సవాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నేల పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంపొందించి, అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, స్థానిక సర్పంచ్, జేడీ హార్టికల్చర్, జిల్లా హార్టికల్చర్ అధికారి కిషోర్, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ మరియు శాస్త్రవేత్తలు, కొత్తగూడెం ఏడీఏ, చుంచుపల్లి మండల వ్యవసాయ అధికారి, ఏఈఓలు, అనుబంధ శాఖల అధికారులు, సాయిల్ శాంపిల్స్ వాలంటీర్లు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

