గ్యాస్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి
డిమాండ్లతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా
కాకతీయ, అశ్వాపురం/మణుగూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించడంతో పాటు, అశ్వాపురం మండలంలో ఎదురవుతున్న ఇంధన కొరతను నివారించి దిగుమతులను పెంచాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో అశ్వాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమటం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు డీజిల్ దొరక్క రైతులు ట్రాక్టర్లు నడపలేక పంట పనులకు ఆటంకం కలుగుతోందని, మరోవైపు రవాణా వ్యవస్థ స్తంభించి లారీ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మధ్య, పేద తరగతి కుటుంబాలు గ్యాస్ కొరతతో సతమతమవుతుంటే, దళారులు బ్లాక్ మార్కెట్‌లో వీటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సామాన్యుడు ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ పోయించుకోవాలన్నా గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని మండిపడ్డారు. అధికారులు మాత్రం కొరత లేదని చెబుతున్నారే తప్ప, ఆచరణలో నివారణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్, ఏఐటీయూసీ మండల గౌరవ అధ్యక్షులు జక్కుల రామచంద్రరావు, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్, సీపీఐ మండల సహాయ కార్యదర్శి మేలపుర సురేందర్ రెడ్డి, కొండపర్తి ప్రసాద్, బండ్ల సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.

