రైతు మరణంపై ఆగ్రహం…
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
గద్దపాకలో రైతు అంత్యక్రియలకు హాజరై పాడే మోసిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
ప్రభుత్వం రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్
కాకతీయ,శంకరపట్నం: మండలంలోని గద్దపాక గ్రామ సర్పంచ్ కొయ్యడ పరుశరాములు తండ్రి కొయ్యడ ఐలయ్య(రైతు) గుండెపోటుతో మృతి చెందిన ఘటనపై రాజకీయ వేడి నెలకొంది. వడ్ల కుప్పపై గుండెపోటుతో ప్రాణాలు విడిచిన రైతు ఐలయ్య అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై పాడే మోసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు ఐలయ్య మృతికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసినా తూకం వేయకపోవడం వల్ల తీవ్ర ఆవేదనకు గురై ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. గత 15 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోసినా తూకం వేయకపోవడంతో ఐలయ్య మనస్తాపానికి గురై వడ్ల కుప్పపైనే గుండెపోటుతో మరణించినట్లు పేర్కొన్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు ఐలయ్య కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం మాత్రమే కాకుండా, ధాన్యం తరలించేందుకు లారీలు ఏర్పాటు చేసి, మిల్లుల కేటాయింపులు చేయాలని సూచించారు.
మండలంతో పాటు మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం తూకాలు వేయకపోవడం, లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయని తెలిపారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముడుపోకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతు బీమా ద్వారా రైతు మరణిస్తే కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేవారని, ప్రస్తుతం అలాంటి భరోసా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ధాన్యం తూకాలు వేగవంతం చేసి, మిల్లులకు తరలింపు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

