కరీంనగర్లో హైటెన్షన్
నేతల సవాళ్లతో అప్రమత్తమైన పోలీసులు
పార్టీ కార్యాలయాల వద్ద భారీ భద్రత
కాకతీయ, కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య నెలకొన్న రాజకీయ వివాదం కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి, వాహనాల ధ్వంసం ఘటనల అనంతరం నగర పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ పార్టీ కార్యాలయాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నేతల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. శుక్రవారం ఇరు పార్టీల నేతలు నిర్వహించిన విలేకరుల సమావేశాల వద్ద కూడా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు సున్నిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక పహారా నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అనుచరులు, ఇతర పార్టీ నేతల కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.

