గిరిజన గ్రామాలకు బస్సు వేయాల్సిందే
మల్లారం, పోట్లపల్లి మీదుగా ఆర్టీసీ సర్వీసు నడపాల్సిందే
డిపో అధికారులను నిలదీసిన మల్లారం సర్పంచ్ ఇర్పా సాంబశివరావు
కాకతీయ, పినపాక/మణుగూరు : “పాలకులకు మా ఊర్లు కనిపించడం లేదా? విద్యార్థులు, రోగులు నానా ఇబ్బందులు పడుతున్నా బస్సు సౌకర్యం కల్పించకపోవడం ఎంతవరకు సమంజసం?” అంటూ పినపాక మండల గిరిజన గ్రామాల ప్రజాప్రతినిధులు నిలదీశారు. మండల పరిధిలోని మల్లారం, పోట్లపల్లి, గడ్డంపల్లి గ్రామాల మీదుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని మల్లారం సర్పంచ్ ఇర్పా సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం మల్లారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రవాణా సౌకర్యం లేక మారుమూల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు సర్వే చేయాలి..
ప్రస్తుతం పాతరెడ్డిపాలెం నుండి మణుగూరు మీదుగా నడుస్తున్న బస్సు సర్వీసు తరహాలోనే, తమ గ్రామాల మీదుగా కూడా బస్సు నడపాలని సర్పంచ్ సాంబశివరావు కోరారు. ముఖ్యంగా నిరుపేదలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం పట్టణాలకు వెళ్లే రోగులకు బస్సు సౌకర్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మణుగూరు ఆర్టీసీ డిపో అధికారులు వెంటనే స్పందించి, ఈ గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి బస్సు సర్వీసును ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ కొమరం రాధాబాయి, నాయకులు మేకల శిరీషా, దాట్ల మోహన్‌రావు, గలిగె రమేష్, సోయం చుక్కయ్య, పోలెబోయిన నారాయణ, వాడ సాంబ, మడవి భీమయ్య, ఖాదర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

