బండి సంజయ్ కుమారుడిపై పీడీ యాక్ట్ పెట్టాలి!
బాలికపై అఘాయిత్యం జరిగినా ప్రభుత్వ చర్యలేవీ
ఇదేనా బీజేపీ ‘బేటీ బచావో’ నినాదానికి నిదర్శనమా?
హనీ ట్రాప్ కాదు.. అది హేయమైన చర్య
సంజయ్ కొడుకేమీ జేమ్స్ బాండ్ కాదు.. అతడో ఖైదీ నెంబర్ 786″
స్టేషన్ బెయిల్ వచ్చేలా బలహీనమైన సెక్షన్లు పెట్టారు
దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం
కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
కాకతీయ, హైదరాబాద్ : “తెలంగాణలో గత 15 రోజులుగా శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. పోలీసు శాఖ కేవలం తూతూమంత్రంగా పనిచేస్తోంది” అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో నమోదైన పోక్సో కేసు వివరాలను వెల్లడించారు. ఈ అఘాయిత్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బండి సాయి భగీరథ్ ఓ మైనర్ బాలికను ఛాటింగ్ ద్వారా వేధించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడుసార్లు అత్యాచార యత్నం చేశారని ఆరోపించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మత్తు మందు కలిపి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. బండి సంజయ్ తన కుమారుడిని వెనకేసుకొస్తూ బాధితురాలి కుటుంబాన్ని బెదిరిస్తున్నారని, ఇది బీజేపీ ‘బేటీ బచావో’ నినాదానికి నిదర్శనమా? అని ప్రశ్నించారు. ఈ కేసులో స్టేషన్ బెయిల్ వచ్చేలా బలహీనమైన సెక్షన్లు పెట్టడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.
హనీ ట్రాప్ కాదు.. అది హేయమైన చర్య
బీజేపీ సోషల్ మీడియా ఈ ఘటనను ‘హనీ ట్రాప్’ అంటూ ప్రచారం చేయడాన్ని ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు. “హనీ ట్రాప్ అనేది దేశ భద్రతకు సంబంధించిన గూఢచారుల మీద చేసేది. బండి సంజయ్ కొడుకేమీ జేమ్స్ బాండ్ కాదు.. అతడో ఖైదీ నెంబర్ 786” అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఒత్తిడితోనే బాధితురాలి తల్లిదండ్రులపై నిర్మల్ మరియు కరీంనగర్లో అక్రమ కేసులు పెట్టించారని, పోలీసులే వారికి ఈ ఐడియా ఇచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మేజిస్ట్రేట్ ముందు మైనర్ బాలిక వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలి. పేట్ బషీరాబాద్, కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ల సీసీ టీవీ ఫుటేజీలను భద్రపరచాలన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డిల మధ్య ఉన్న అవినాభావ సంబంధం వల్లే కేంద్ర మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు.

