3 వేల గోనె సంచుల గోల్మాల్?
చెన్నారావుపేటలో రైతుల ఆగ్రహం
గన్నిల కొరతపై అధికారులను నిలదీసిన రైతులు
పంపిణీలో అక్రమాలంటూ ఆరోపణలు
కాకతీయ, చెన్నారావుపేట: అకాల వర్షాలతో తడిసిన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే గోనె సంచుల పంపిణీలో భారీ అక్రమాలు జరిగాయంటూ చెన్నారావుపేట మండల కేంద్రంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 3 వేల గోనె సంచులు గల్లంతయ్యాయంటూ రైతులు ఆరోపించగా ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించేందుకు శనివారం చెన్నారావుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గోనె సంచుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారుల చుట్టూ తిరిగినా సరైన స్పందన లేదని వాపోయారు.
3 వేల సంచులు ఎటు..?
రైతుల ఫిర్యాదులపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే అక్కడే ఉన్న సీఈఓ చిట్టే రవిని గోనె సంచుల లభ్యతపై ప్రశ్నించగా 10 వేల గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయని ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే రైతులు ఇన్చార్జి అధికారి కట్టారెడ్డిని అడగగా కేవలం 7 వేల సంచులే ఉన్నాయని చెప్పడం వివాదానికి దారితీసింది. గంటల వ్యవధిలోనే 3 వేల సంచులు ఎటు వెళ్లాయని రైతులు అధికారులను నిలదీశారు.
కొంతమంది ప్రైవేట్ వ్యాపారస్తులకు గోనె సంచులు కట్టబెట్టారని, సామాన్య రైతులకు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచించిన వారికే కాంటాలు, గోనె సంచులు ఇస్తున్నారని మండిపడ్డారు.
పంపిణీపై అనుమానాలు
నేరుగా రైతులకు సంచులు పంపిణీ చేయాలని కోరినా విధానాలు వేరుగా ఉన్నాయి అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపించారు. కట్టారెడ్డి అనే అధికారి డబ్బులు తీసుకుని 3 వేల సంచులను పక్కదారి పట్టించారని బహిరంగంగానే ఆరోపించడం కలకలం రేపింది.
సీరియల్ టోకెన్ల జారీ ప్రక్రియలో కూడా గందరగోళం నెలకొందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అధికారి ఒక మాట, మరో అధికారి మరో మాట చెప్పడంతో రైతుల్లో అనుమానాలు మరింత పెరిగాయని తెలిపారు. పంపిణీలో ఎలాంటి పారదర్శకత కనిపించడం లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. ఎండ తీవ్రత, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతుంటే అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే సొంత మండలంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
గోనె సంచుల పూర్తి వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని, పంపిణీలో పారదర్శకత పాటించాలని రైతులు డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న, జక్క అశోక్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

