ప్రమాద బాధితుడికి అండగా విప్ ఆది శ్రీనివాస్
క్షతగాత్రుడిని స్వయంగా ఆస్పత్రికి తరలింపు
మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశాలు
మానవత్వంపై స్థానికుల ప్రశంసలు
కాకతీయ, వేములవాడ: వేములవాడ పట్టణ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడిని స్వయంగా ఆస్పత్రికి తరలించారు.
ఆది శ్రీనివాస్ వేములవాడ రూరల్ మండల పర్యటన ముగించుకుని పట్టణానికి తిరిగి వస్తున్న సమయంలో చెక్కపల్లి రోడ్డులోని పెద్దమ్మ చౌరస్తా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్‌కు చెందిన ఊరడి భూమయ్య వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే స్పందించిన విప్
ఈ ఘటనను గమనించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెంటనే స్పందించి బాధితుడిని పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న అనంతరం ఆలస్యం చేయకుండా తన సొంత వాహనంలోనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.
అనంతరం వైద్యులతో మాట్లాడి బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద సమయంలో ఆది శ్రీనివాస్ చూపిన చొరవ, మానవత్వంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజా ప్రతినిధి అంటే ప్రజల కష్టసుఖాల్లో ముందుండాలని ఆయన మరోసారి నిరూపించారని పలువురు అభిప్రాయపడ్డారు.

