ఏసీబీ వలలో గంగాధర ఇన్ఛార్జ్ ఎస్ఆర్వో
పెద్దపల్లి రిజిస్ట్రార్ కార్యాలయ అక్రమాల కేసులో అరెస్ట్
నిజామాబాద్ నివాసంలో అదుపులోకి తీసుకున్న అధికారులు
కాకతీయ, కరీంనగర్ : పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో వెలుగుచూసిన అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎస్ఆర్వోగా విధులు నిర్వహిస్తున్న మండ కిరణ్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. పెద్దపల్లి కార్యాలయంలో పనిచేసిన కాలంలో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. గతంలో పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా, అనంతరం ఇన్ఛార్జ్ ఎస్ఆర్వోగా కిరణ్ కుమార్ బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తుల ద్వారా పెద్ద ఎత్తున నగదు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో 2025 నవంబర్ 14న ఏసీబీ అధికారులు సదరు కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో లెక్కలోకి రాని రూ.1,06,500 నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, అక్రమ లావాదేవీలకు సంబంధించిన పలు కీలక ఆధారాలను సేకరించారు.
దర్యాప్తులో తేలిన వసూళ్ల పర్వం
ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన అధికారులు, కిరణ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రజలను వేధిస్తూ, అక్రమాలకు పాల్పడే అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఏసీబీ వర్గాలు హెచ్చరించాయి. రిజిస్ట్రేషన్ శాఖలో కొనసాగుతున్న అవినీతిపై ఈ అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది. విచారణలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

